ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఏపీ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావును డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరభ్ కుమార్ ప్రసాద్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు. ద్వారకా తిరుమలరావు 1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.
తిరుమలరావు 2021 జూన్ నెలలో ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా నియమితులయ్యారు. గత మూడేళ్లుగా ఆయన ఆర్టీసీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు రైల్వే శాఖలో డీజీపీగా ఉన్నారు. విజయవాడ సీపీగానూ ప ని చేశారు.
ఇక గత నెలలో ఏపీలో ఎన్నికలకు కొన్ని రోజుల ముందు డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఆ సమయంలో ద్వారకా తిరుమలరావును ఏపీ డీజీపీగా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అనూహ్యంగా హరీష్ కుమార్ గుప్తాకు ఏపీ పోలీస్ బాస్‌గా అవకాశం దక్కింది. దాంతో మే 6న ఆయన బాధ్యతలు చేపట్టారు. తాజాగా కొలువుదీరిన కూటమి సర్కార్ కూడా ఆయననేజీపీగా కొనసాగించాలని భావించింది.
అయితే, చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా జరిగిన గందరగోళం ఆయనకు ప్రతికూలంగా మారింది. ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చిన ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు వెళ్లాల్సిన గవర్నర్ నజీర్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఆయన కాన్వాయ్ ఏకంగా 40 నిమిషాల పాటు నిలిచిపోయింది. దాంతో ఆయన ప్రధాని స్వాగతం పలకడానికి వెళ్లలేకపోయారు. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారడం పట్ల గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై అటు ప్రధాని కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పుడే హరీష్ కుమార్ గుప్తాపై వేటు ప డుతుంద ని అనుకున్నారు. తాజాగా ప్రభుత్వం అదే చేసింది.
Get real time update about this post category directly on your device, subscribe now.