త్వరలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తి చేస్తాం: హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత

by RMK NEWS
0 comments

ఆంధ్రప్రదేశ్ లో అర్ధాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సత్వరమే చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. 6,100 పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక సామర్థ్య (పీఎంటీ,పీఈటీ) పరీక్షలను ఐదు నెలల్లోగా పూర్తి చేస్తామని ఆమె స్పష్టం చేశారు. గత 2022 కాలంలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4,59,182 మంది హాజరుకాగా అందులో 95,209 మంది తదుపరి దశకు ఎంపికయ్యారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సహా పలు కారణాల వల్ల వాయిదా పడడంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్ (సివిల్)- 3580; కానిస్టేబుల్ (APSP) -2520 పోస్టుల ప్రక్రియ వాయిదా పడిందన్నారు. ప్రిలిమినరీ వ్రాత పరీక్షకు మొత్తం 3,622 మంది హోంగార్డులు హాజరవగా అందులో 382 మంది హోంగార్డులు మాత్రమే అర్హత సాధించారన్నారు. ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించని 100 మంది హోంగార్డులు 14 రిట్ పిటిషన్లను హైకోర్టులో వేశారు. “హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించడం ద్వారా హోంగార్డుల కోటాలో ప్రత్యేక మెరిట్ జాబితాను ప్రకటించాలని వారు కోర్టును కోరారు. ఆ వంద మంది హోంగార్డులను తదుపరి దశకు అనుమతించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని హోం మంత్రి వివరించారు. అప్పటి నుంచి రిక్రూట్మెంట్ ప్రక్రియను గత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకుండా నిలిపివేసిన విషయాన్ని హోంమంత్రి గుర్తు చేశారు. ఈ విషయం ప్రస్తుత కూటమి ప్రభుత్వం దృష్టికి వచ్చాకా, దీనిపై న్యాయ సలహా తీసుకొని.. ఆ సలహా మేరకు ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో రెండవ దశ (PMT/PET)ను వెంటనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుందన్నారు. దీనికి సంబంధించి రెండవ దశ అప్లికేషన్ ఫారం నింపడానికి, భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (slprb.ap.gov.in) వెబ్సైట్ లో పొందుపరుస్తామని హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రెండవ ధశలో ఉత్తీర్ణులైన వారికి మూడవ దశ ప్రధాన పరీక్ష (Final Written Exam) జరుగుతుందని హోం శాఖా మంత్రి తెలిపారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You Might Also Like

You may also like