బొగ్గు బ్లాక్ లను సింగరేణికి నేరుగా కేటాయించాలని, వేలంపాట ఆపాలని సీఐటీయా జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. వెంకటేశ్ డిమాండ్ చేశారు. సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో నిర్వహించే సింగరేణి పరిరక్షణ యాత్రకు తమ సంఘం మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. సింగరేణి ప్రైవేటీకరణతో సంస్థ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని హెచ్చరించారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశంలో సాయిబాబు మాట్లాడారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై గత నాలుగు సంవత్సరాలుగా సింగరేణిలో నిరసన జరుగుతూనే ఉన్నా కేంద్రం పెడచెవిన పెడుతుందన్నారు. కిషన్ రెడ్డి కేంద్ర గనుల శాఖ మంత్రిగా ఉండడం వల్ల సింగరేణిని కాపాడుకోవడం సులభమని అందరూ భావిస్తారని అన్నారు. రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలున్నారని చెప్పారు. వారంతా ప్రజల ఆశలను అడియాశలు చేశారని విమర్శించారు. మోడీని మోయడానికే ఉన్నారు తప్ప ఓట్లేసిన ప్రజల ప్రయోజనాలను కాపాడటం లేదన్నారు. సింగరేణిని ప్రయివేటీకరించబోమంటూ కిషన్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు.
Get real time update about this post category directly on your device, subscribe now.