హైదరాబాద్ మహా నగరంలో గణేష్ నవరాత్రుల ముగింపు సందర్భంగా లడ్డూ వేలం పాటలు హోరాహోరీగా సాగాయి. పలు ప్రాంతాలలో జరిగిన వేలల్లో గణేష్ లడ్డూలకు ధరలు పలికాయి. అందులో అత్యధిక ధర నమోదైన ఐదు లడ్డూల వివరాలు ఇలా ఉన్నాయి.
బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో నిర్వహించిన లడ్డూ వేలంలో 5 కిలోల లడ్డూకు ఏకంగా రూ.1.01 కోట్ల ధర పలికింది. దీంతో ఈ లడ్డూ అత్యధిక ధర నమోదైన వాటిలో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే ఎంతో ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ గణేషుడి 21 కిలోల లడ్డూను సామ ప్రణీత్ రూ.39 లక్షలకు దక్కించుకున్నారు. ఈ లడ్డూ వేలం పాటపై ఆసక్తి నెలకొని ఉంటుంది. ప్రతి ఏడాది రికార్డ్ ధరకు బాలాపూర్ లడ్డూ అమ్ముడవుతూ ఉంటుంది. ఇకపోతే కోహినూర్ బై ఆర్రో రియాల్టీలో నిర్వహించిన వేలంలో లడ్డూ రూ.30.50 లక్షలకు అమ్ముడుపోయింది.
మై హోమ్ భూజాలో నిర్వహించిన వేలంలో గణేశ్ లడ్డూకు రూ.25 లక్షల ధర లభించింది. కొండాపూర్‌లోని మై హోంలో నిర్వహించిన వేలంలో రూ.21.11 లక్షల ధర నమోదైంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడు కూడా గణేష్ లడ్డూ వేలంపాటలు ఆసక్తికరంగా సాగాయి. వేలం పాటలో లడ్డూ తీసుకుంటే మీకు మంచి జరుగుతుందనే నమ్మకంతో చాలా మంది భారీ మొత్తంలో చెల్లించి లడ్డూను సొంతం చేసుకుంటూ ఉంటారు.
