మాదాపూర్ క్రైం : హైదరాబాద్ మాదాపూర్లో చోటుచేసుకున్న యువతి అనుమానాస్పద మృతి కేసు చివరకు హ*త్య కేసుగా మారింది. ఓయో హోటల్లోని నిఖిత అనే యువతి మృతి చెందడం కలకలం రేపగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా శ్రీనివాస రవితేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వెనుక ఉన్న సంబంధం, విభేదాలు బయటపెడుతున్నాయి.
నాలుగేళ్లుగా సహజీవనం
నిఖిత, శ్రీనివాస రవితేజ గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఇన్నేళ్లుగా కలిసి ఉన్న ఇద్దరి మధ్య ఇటీవల పెళ్లి అంశం వివాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. నిఖిత తనను వివాహం చేసుకోవాలని రవితేజపై ఒత్తిడి తెస్తుండగా.. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇదే మాదాపూర్లోని ఓయో హోటల్లో ఇద్దరూ కలుసుకున్నారు. అక్కడ మరోసారి పెళ్లి విషయంపై వాగ్వాదం జరిగినట్లు. మాటామాటా పెరగడంతో పరిస్థితి అదుపుతప్పింది.
ఆవేశంలో దాడి.. ప్రాణాలు కోల్పోయిన యువతి
తీవ్రరూపం దాల్చడంతో రవితేజ నిఖితపై దాడి చేసిన ఘటనపై పోలీసులు ఆరోపిస్తున్నారు. తీవ్ర గాయాలతో ఆమె హోటల్ గదిలోనే మృతి చెందినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. నిఖిత మృతి చెందిన వెంటనే గుర్తించిన రవితేజ అక్కడి నుంచి పరారయ్యాడు. హోటల్ నుంచి వెళ్లిన అనంతరం విశాఖపట్నం వైపు వెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు.
విశాఖలో ఆత్మహత్యాయత్నం
హత్య అనంతరం పోలీసులకు చిక్కుతాననే రవితేజ విశాఖపట్నంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే అతడి కదలికలను పోలీసులు సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు. చివరకు అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
కేసులో కీలక ఆధారాల సేకరణ
నిందితుడిని అదుపులోకి తీసుకున్న మాదాపూర్ పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు తెలిపారు. హోటల్లో జరిగిన పరిణామాలు, ఇద్దరి మధ్య ఉన్న సంబంధం, గతంలో జరిగిన వివాదాలు, నిఖిత మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఏళ్ల తరబడి కొనసాగుతున్న సహజీవనం చివరకు పెళ్లి విషయంలో తలెత్తిన విభేదాలతో విషాదంగా ముగియడం ఈ ఘటనలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అయితే హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర అంశాలు పోలీసుల దర్యాప్తు తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.